BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 4:26 am Posted by : BHARATH PRATHINIDHI

ప్రజలకు పౌర సేవలను ప్రతి అధికారి బాధ్యతాయుతంగా అందించాలి

ప్రభుత్వ పధకాల అమలు, కార్యదర్శుల పనితీరుపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిఎంసి కమిషనర్

గుంటూరు, 06 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని వార్డుల వారీగా ప్రభుత్వ పధకాల అమలు, కార్యదర్శుల పనితీరును జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నియమింపబడిన ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, తాగునీటి సరఫరా, శ్యాంపిల్స్ సేకరణ, వీధి దీపాల పర్యవేక్షణ, అభివృద్ధి పనుల వేగవంతంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కూడా వార్డు ప్రత్యేక అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు. కేటాయించిన వార్డు పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు మరియు సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారులుగా నియమితులైన సిబ్బంది అందరూ తమకు కేటాయించిన వార్డు సచివాలయాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు, పౌర సేవలను వేగంగా ప్రజలకు అందించే దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వార్డ్ సచివాలయ కార్యదర్శులు ఇక నుండి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించామని, వారి సెలవులు కూడా ప్రత్యేక అధికారుల ఆమోదంతోనే మంజూరు చేయాలని విభాగాధిపతులకు తెలిపామన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.