భీమినేని వందనా దేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే ప్రగతి సాధ్యమౌతుందని, కుటుంబ ఆదాయాలు పెరుగుతాయని, మహిళలలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరిగి వారి పట్ల గౌరవం పెరుగుతుందని గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ భీమినేని వందనా దేవి పేర్కొన్నారు. ఈనెల 2వ తేదీన ఆదివారం గుంటూరులోని జిల్లా గ్రంధాలయ సంస్థ హాలులో మానవత ఆధ్వర్యంలో శారీ డ్రేపింగ్ శిక్షణ కార్యక్రమం కె. సతీష్ నేతృత్వంలో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన భీమినేని వందనాదేవి ప్రసంగిస్తూ ఫ్యాషన్ రంగంలో అపారమైన అవకాశాలు పెరుగుతున్నాయని, మహిళలు వాటిని అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా లభించే ఋణ సదుపాయాన్ని వ్యాపారాలు చేయడానికి వినియోగించి సంపదను సృష్టించాలని కోరారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానంలో 147 కోట్లతో ఉన్నప్పటికీ నైపుణ్యాల కొరతతో వెనుకబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో దేశంలోనే
అట్టడుగున 36వ స్థానంలో ఉందని, ప్రతి ముగ్గురి మహిళలలో ఒకరు నిరక్షరాస్యులుగా కొనసాగుతున్నారన్నారు. శిక్షణ శిబిరం కోఆర్డినేటర్ కె. సతీష్ ప్రసంగిస్తూ వివిధ ప్రాంతాల నుండి 120 మంది మహిళలు శారీ డ్రేపింగ్ శిక్షణలో పాల్గొని మెలుకువలను నేర్చుకోవటం అభినందనీయమన్నారు. నేర్చుకున్న నైపుణ్యాలను మరింత సాధన చేసి ఆర్థికంగా స్వయం ఉపాధి పొందాలని మహిళలను కోరారు. శిక్షణ శిబిర ట్రైనర్, ప్రముఖ బ్యూటీషియన్ కుమారి పట్టపు స్వప్న ప్రసంగిస్తూ ఫ్యాషన్ రంగంలో తాను ఎదిగిన అనుభవాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మానవత సంస్థ 5 వేల రూపాయలు విలువ గల పోటీ పరీక్షల పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థ డిప్యూటీ లైబ్రరియన్ ఝాన్సీ లక్ష్మి కు అందజేశారు. అతిథులు శిక్షణ పొందిన ప్రతి మహిళకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మానవత సెక్రటరి చావా శివాజీ, డైరెక్టర్ వేజెండ్ల బాలకృష్ణ చౌదరి, ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ టి. సాయిరాం, పూర్వ అధ్యక్షులు డా|| కోటా శ్రీనివాస్, డైరెక్టర్ ఎన్. సాంబశివరావు, జాయింట్ సెక్రెటరీ మహేశ్వర రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.