BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 2:27 pm Posted by : BHARATH PRATHINIDHI

నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో కలకలం

నంద్యాల క్రైమ్‌, 08 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో అర్ధరాత్రి సమయంలో ఓ అపరిచిత వ్యక్తి సంచరించిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించిన వ్యక్తి వార్డులోకి వచ్చి హల్‌ చల్‌ చేసినట్లు చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపించారు. చిన్నారుల వార్డులోకి అపరిచిత వ్యక్తి ప్రవేశించడంతో అక్కడ చికిత్స పొందుతున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వార్డులో భద్రతా సిబ్బంది, నర్సుల పర్యవేక్షణ తగినంతంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రత విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే ఎవరైనా పిల్లలను ఎత్తుకెళ్లే పరిస్థితి ఏర్పడితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఆస్పత్రిలోకి చిన్నారుల వార్డుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసి, అనుమతి లేని వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరిండెంట్‌ను ప్రశ్నించగా రేపు చూస్తాం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తల్లిదండ్రులు ఆరోపించారు. చిన్నారుల వార్డులో భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘనటలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.