చెరుకుపల్లి, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : సామాన్య ప్రజలకు మేలైన ప్రయోజనాలు కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అమ్మకం కేంద్రాలను ప్రారంభించిందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ తెలిపారు. సోమవారం చెరుకుపల్లి మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి గ్రంధి సుబ్బారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ, రూ. 62 విలువై బిపిటి స్టీమ్ బియ్యాన్ని రూ. 52లకే, రూ. 58 విలువైన రా బిపిటి బియ్యాన్ని రూ. 50లకే కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నామని, ప్రతి రేషన్ కార్డుకు నెలకు 10 కిలోల చొప్పున అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 115 రైతుబజార్లు, 500 రైస్ మిల్లర్ల కేంద్రాల ద్వారా ఈ సౌకర్యం అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని అనగాని శివప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సురేష్ కుమార్, వీఆర్వో నాగరాజు, స్థానిక నాయకులు ఎం.ఆర్.కె. మూర్తి, కుమారస్వామి, రామకృష్ణ, రాంబాబు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.