BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 1:58 pm Posted by : BHARATH PRATHINIDHI

డీఎస్సీలో ఆక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

విశాఖపట్నం, 08 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డీఎస్సీలో ఆక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడు రోజులుపాటు నిర్వహించిన జెన్‌ జీ రిలే నిరాహారదీక్షల్లో ఎక్కడా విద్యార్థులు, యువత కనిపించలేదు. కార్యకర్తలతోపాటు సమీకరించిన వృద్ధులు, మహిళలతో శిబిరాలను నింపేసి పార్టీ కార్యక్రమం మాదిరిగా దీక్షలను నేతలు ముగించేశారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేమీ లేదని, ప్రక్రియ మొత్తం పారదర్శకంగానే జరిగిందని, దీనిపై చర్చకు రావాలంటూ స్వయంగా మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు, నాయకులు సవాల్‌ చేసినా వైసీపీ నేతలు స్పందించలేదు. కానీ, తమ మొండి వాదదను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే సీబీఐ విచారణ కోరుతూ డీఎస్సీలో అన్యాయానికి గురైనవారు, విద్యార్థులు జెన్‌జీ రిలే నిరాహారదీక్ష పేరుతో మూడు (ఈనెల ఆరు, ఏడు, ఎనిమిది తేదీల్లో) రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని వైసీపీ నేతలు ప్రకటించారు. ఇందుకోసం నియోజకవర్గాల్లో టెంట్‌లు వేయించారు. అయితే ఒకటి, రెండుచోట్ల ఇద్దరు, ముగ్గురు యువకులు తప్పితే ఎక్కడా విద్యార్థులు, యువతీయువకులు ముందుకురాకపోవడం వైసీపీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పార్టీ నేతలు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలే మూడు రోజుల దీక్షలను ముగించేశారు.