BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 2:29 am Posted by : BHARATH PRATHINIDHI

ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

గుంటూరు, 23 ఆగస్టు 2926, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు కలెక్టరేట్‌లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కె. ఖాజావలి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్ సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దుర్గా భాయి, కలెక్టరేట్ ఏఓ మల్లీశ్వరి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.ఈ సందర్భంగా డీఆర్‌ఓ ఖాజావలి మాట్లాడుతూ, టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య సమరయోధుడిగా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా దేశానికి, రాష్ట్రానికి విశిష్ట సేవలందించారని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన ధైర్యసాహసాలతో పాల్గొని ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు.బ్రిటిష్ సైనికులు తుపాకులు గురిపెట్టినా వెనుకడుగు వేయకుండా తన గుండె చూపించి నిలబడిన ధైర్యానికి గుర్తుగా ఆయనకు ‘ఆంధ్రకేసరి’ అనే బిరుదు లభించిందన్నారు. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యం, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకు సేవలందించిన ఆయన పరిపాలనా దక్షత, ప్రజాసేవా దృక్పథం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు.టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని డీఆర్‌ఓ పిలుపునిచ్చారు. దేశం కోసం, ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.