BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 1:54 pm Posted by : BHARATH PRATHINIDHI

గుంటూరులో ‘అమరావతి చిత్రకళా వీధి’

సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత

నగరంలో కోరిటపాడు, విద్యా నగర్ రోడ్డు లో ఈ నెల 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన

700 మంది కళాకారుల చిత్రాలతో భారీ చిత్రకళా ప్రదర్శన

గుంటూరు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళా వారసత్వాన్ని పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్‌ పొడపాటి తేజస్వి అన్నారు. నగరంలోని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత పాఠశాల నందు గురువారం జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆమె మాట్లాడారు. గుంటూరు నగరంలో కోరిటపాడు, విద్యా నగర్ రోడ్డు లో ఈ నెల 8, 9 తేదీల్లో అమరావతి చిత్రకళా వీధి పేరుతో రెండు రోజులపాటు ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. విదేశాల్లో నిర్వహించే చిత్రకళా ప్రదర్శనల తరహాలో రాష్ట్రంలో తొలిసారిగా రాజమహేంద్రవరంలో ఇటువంటి ప్రదర్శన నిర్వహించామని, రెండోసారి గుంటూరు నగరంలో “అమరావతి చిత్రకళా వీధి” పేరుతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 700 మంది కళాకారులు రూపొందించిన చిత్రాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.

కళాకారులకు ప్రోత్సాహం.. కళలకు వేదిక

వివిధ కళారూపాలు, సృజనాత్మకత, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలను ప్రతిబింబించే చిత్రాలను ఈ ప్రదర్శనలో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు, యువ కళాకారులకు ప్రోత్సాహం అందించడంతో పాటు వారి ప్రతిభను ప్రజలకు పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కళలు, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని, కళాకారులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర కళా వైభవాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని తేజస్వి అన్నారు.

ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి

“అమరావతి చిత్రకళా వీధి”లో ఏర్పాటు చేసే చిత్రకళా ప్రదర్శనను గుంటూరు నగర ప్రజలు, కళాభిమానులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో సందర్శించాలని ఆమె కోరారు. ఇటువంటి కార్యక్రమాలకు ప్రజల ఆదరణ లభించడం ద్వారా కళాకారుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళా వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని, కళాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ కళలకు ఆదరణ కల్పించడం ద్వారా మన సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు అందించాలి అని ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్‌ పేర్కొన్నారు. ఈ సమావేశం లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జున్ పాల్గొన్నారు.