BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 2:36 pm Posted by : BHARATH PRATHINIDHI

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క

భద్రాద్రి కొత్తగూడెం, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. ఈరోజు(ఆదివారం) అశ్వారావుపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, పాల్గొన్నారు. స్థానిక కూడలిలో కుమురం భీమ్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. మన జాతి ఔన్నత్యాన్ని, జాతి కీర్తిని మన హక్కులను కాపాడినటువంటి మహనీయుడి విగ్రహావిష్కరణ చేయడం సంతోషకరమని తెలిపారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. భూముల సమస్యలు సహా గిరిజనుల సమస్యలను తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం పేదలు, నిరక్షరాస్యులు వస్తే వారిని అధికారులు నిర్లక్ష్యం చేయకుండా గౌరవంగా చూడాలని సూచించారు. ప్రజల వినతులను స్వీకరించి వారి కష్టాలకు పరిష్కరించాలని ఆదేశించారు. కుమురం భీమ్ పోరాట స్ఫూర్తితో గిరిజన హక్కుల సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మన భాష, వేషధారణ, సంస్కృతి గిరిజనుల అస్థిత్వం నిలుపుకోవడం మన బాధ్యత అని చెప్పారు. భవిష్యత్తు తరాలకు అందించాల్సిన గొప్ప ఆస్తి మన సంస్కృతి అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.