BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 6:17 pm Posted by : BHARATH PRATHINIDHI

ఉద్యోగ విరమణ కార్యక్రమంలో గురువులను సన్మానించిన సహకార శాఖ డెప్యూటీ రిజిస్ట్రార్ పురుషబాబు

గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్: సాధారణంగా ఉద్యోగ విరమణ కార్యక్రమం అంటే రిటైర్ అవుతున్న వ్యక్తి డిపార్ట్మెంట్ లో పనిచేసే అధికారులను, ఉద్యోగులను, స్నేహితులను, బంధువులను పిలిచి, వారి చేత దండలు, శాలువాలు వేయించుకొని సంతోషకరమైన జ్ఞాపకాలతో వీడ్కోలు తీసుకుంటారు. కానీ అందుకు భిన్నంగా సహకార శాఖలో పనిచేసిన డెప్యూటీ రిజిస్ట్రార్ చిలుకూరి పురుషబాబు వినూత్న రీతిలో తన ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రశంసలందుకున్నారు. ఆదివారం గుంటూరు ఎస్.వి.ఎన్ కాలనీ గ్రాండ్ వెంకటేష్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో.. సహకార శాఖ డెప్యూటీ రిజిస్ట్రార్ చిలుకూరి పురుషబాబు గ్రూప్ 1 అధికారి హోదాలో పదవీ విరమణ పొందినందుకు తనకు చదువు చెప్పిన గురువులందరిని ఆహ్వానించి, వారందరిని ఘనంగా సన్మానించి, నూతన పద్దతికి శ్రీకారం చుట్టారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కాలేజీ (ధరణి కోట) వికాస్ కాలేజీ (గుంటూరు) లలోని అధ్యాపకులు నూతలపాటి తిరుపతయ్య, పర్వతనేని సుఖదేవ్, కోడెల లక్ష్మీనారాయణ, వెలగా రామారావు, కె. రామ్మోహనరావు, పి. శంకరరావు, కె. జగదీశ్వరరావు, ఎన్. మహేశ్వరరావు, ఎన్.సి.సి. రామ్మోహనరావు, సి. సుమతీ దేవి, పి. పూర్ణిమ దేవి తదితరులు మేళతాళాల మధ్య పుష్పమాల, పట్టు శాలువా, నూతన వస్త్రాలు, జ్ఞాపికలతో సత్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా.. గురువు నూతలపాటి తిరుపతయ్య మాట్లాడుతూ.. జీవిత కాల సేవకు వేడుకతో ముగింపు ఇవ్వడం వల్ల ఉద్యోగ విరమణ చేసే వ్యక్తి కి మానసిక మరియు భావోద్వేగ మార్పు ను తెస్తుందన్నారు. పురుషబాబు మాట్లాడుతూ.. 37 సంవత్సరాల సేవ నిశ్శబ్దంగా ముగియకూడదనే తన గురువులను సన్మానించినట్లు తెలిపారు.
అనంతరం గురువులందరూ పురుషబాబు దంపతులను ఆశీర్వదించి, సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు గుమ్మడి సీతారామయ్యచౌదరి, నాగరాజు శ్రీనివాస్, ఆమని రమేష్ బాబు, కిలారి చంద్రశేఖర్, గద్దె ఆంజనేయులు, నంబూరి కోటేశ్వరరావు, రామినేని భ్రమరాంబ, వెలినేని మహేష్, శశి తదితరులు పాల్గొన్నారు.