BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 5:50 pm Posted by : BHARATH PRATHINIDHI

మహిళా ఎస్సై పై వైసీపీ నేతల దాడి హేయం

బాధ్యులను కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

 

గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి : విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై ప్రవల్లికపై వైసీపీ నాయకులు చేసిన దాడి, అనుచిత ప్రవర్తనను టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని అమలు చేసే పోలీసు అధికారిపైనే చేతులు వేసి ఇబ్బందులకు గురిచేయడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా ఎస్సైపై జరిగిన దాడి కేవలం ఒక పోలీసు అధికారిపైనే కాకుండా చట్టవ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించాలన్నారు. విధుల్లో ఉన్న మహిళా అధికారి పై వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు పూర్తిగా అనుచితమైందని, మహిళల పట్ల వారి వైఖరిని బయటపెడుతోందని విమర్శించారు. మహిళల గౌరవం, భద్రత గురించి మాట్లాడే వైసీపీ నాయకత్వం ఈ ఘటనపై సమాధానం చెప్పాలని గళ్ళా మాధవి డిమాండ్ చేశారు. మహిళా ఎస్సైపై చేతులు వేసి, విధులకు ఆటంకం కలిగించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయని అన్నారు. జగన్ రెడ్డి ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలవాల్సిన జగన్ మోహన్ రెడ్డి, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని పరామర్శించడం విచారకరమని ఎమ్మెల్యే విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ ప్రభావంతో ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. మహిళల భద్రత, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.