BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 11:48 am Posted by : BHARATH PRATHINIDHI

శివాని ఆత్మహత్యకు కారణమేంటి ?

రంగంలోకి ఫోర్సెనిక్‌ నిపుణులు, ప్రత్యేక క్లూస్‌ టీంలు

అమరావతి, 29 జూలై 2026, భారత్ ప్రతినిధి : చదువులో ప్రతిభ.. సీఎం ప్రశంసలు.. ముందు కనిపిస్తున్న ఉజ్వల భవిష్యత్తు! అయితే ఇంతలోనే ముర్రం శివాని ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? ఆ బాలిక ఆత్మహత్య వెనుక అసలు కారణమేంటి? ఇప్పుడు ఇదే ప్రశ్నకు సమాధానం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబును వేదనకు గురిచేసిన ఈ ఘటన పోలవరం జిల్లా పోలీసులకు హైప్రొఫైల్‌ కేసుగా మారింది. ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తూ లోతైన దర్యాప్తు చేపట్టారు. శివాని ఆత్మహత్య ఘటనపై ఆమె తల్లి ఫిర్యాదు మేరకు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ కేసులో అసలు కారణాల కోసం అన్వేషిస్తున్నారు. ఆత్మహత్య వెనుక వ్యక్తిగత, కుటుంబ, మానసిక, విద్యాసంబంధ, ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న ప్రతి కోణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. శివాని మరణానికి గల కారణాలను వెలికితీయాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో పోలీసులు శాస్త్రీయ ఆధారాల సేకరణపై దృష్టి పెట్టారు. చివరగా ఆమెను కలిసిన, స్నేహితులు, సహ విద్యార్థులు, టీచర్లు, కుటుంబసభ్యుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు.

డిజిటల్‌ ఆధారాలే కీలకం

కేసు దర్యాప్తులో భాగంగా శివాని చివరి రోజుల కార్యకలాపాలను విశ్లేషించేందుకు పోలీసులు డిజిటల్‌ ఫోరెన్సిక్‌ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శివాని మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌తోపాటు ఆమె తల్లి, తండ్రి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని డేటాను విశ్లేషిస్తున్నారు. ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక క్లూస్‌ టీమ్‌లు ఘటనా స్థలాన్ని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాయి. గత శుక్రవారం రంపచోడవరంలో జరిగిన మెగా పీటీఎంలో శివాని సీఎం చంద్రబాబు అభినందనలు అందుకున్నారు. తర్వాత వేరే ఊరిలో విడిగా ఉంటున్న తండ్రి దగ్గరకు వెళ్లి, ఆనందంగానే తిరిగొచ్చిన శివాని.. తన మరణానికి ముందు ఎవరితో మాట్లాడింది? ఆమెకు వచ్చిన ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు ఏమిటి? ఎవరైనా మానసికంగా ఒత్తిడి చేశారా? లేక ఇతర కారణాల వల్ల తీవ్ర మనోవేదనకు గురైందా? అనే అంశాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు.