BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 10:55 am Posted by : BHARATH PRATHINIDHI

రిషబ్ శెట్టికి అరుదైన అంతర్జాతీయ గౌరవం

మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక అవార్డు

ఫిల్మ్ న్యూస్, భారత్ ప్రతినిధి : ‘ కాంతార ‘ చిత్రంతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కన్నడ నటుడు, దర్శకుడు, నిర్మాత రిషబ్ శెట్టిని అరుదైన అంతర్జాతీయ పురస్కారం వరించింది. భారతీయ చలనచిత్ర రంగానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినందుకు గానూ ఆయనకు ప్రతిష్టాత్మక ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డు’ ( Leadership in Cinema Award ) లభించింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ నెల 13న జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 2026 ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రిషబ్ శెట్టికి నిర్వాహకులు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ సినిమాను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన చూపించిన ప్రతిభకు, చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అంతర్జాతీయ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు ఐఎఫ్‌ఎఫ్ఎమ్ ప్రతినిధులు వెల్లడించారు.

సంస్కృతిని చాటిచెప్పడమే అసలైన ఆనందం: రిషబ్ శెట్టి
కర్ణాటక తీరప్రాంత ఆచారాలు, జానపద సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుండెలకు హత్తుకునే మానవ భావోద్వేగాలతో తెరకెక్కించడంలో రిషబ్ శెట్టి సిద్ధహస్తుడు. ‘కాంతార’ సృష్టించిన ప్రభంజనం తర్వాత, దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ అంతర్జాతీయ పురస్కారం దక్కడంపై రిషబ్ శెట్టి హర్షం వ్యక్తం చేశారు. “మన మట్టి సువాసనలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేయడమే కథకుడిగా నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే అంశం. మన మూలాల ఆధారంగా తీసిన చిత్రాలు సరిహద్దులు దాటి గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించడం ఎంతో గర్వకారణం. ఆస్ట్రేలియా వేదికపై భారతీయ సినిమా ఘనతను పంచుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.