BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 11:19 am Posted by : BHARATH PRATHINIDHI

రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం..!

భారత్‌, చైనాపై 100 శాతం సుంకాలు..

ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : రష్యాపై మరింత కఠిన ఆర్థిక ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే, రష్యా నుంచి భారీగా చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభించనుంది. ఈ బిల్లును దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ కలిసి రూపొందించారు. సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు 86-12 ఓట్లతో మద్దతు లభించింది. అయితే ఇది ఇంకా పూర్తిస్థాయి చట్టం కాలేదు. సెనెట్‌లో మరిన్ని దశలు పూర్తి చేసిన తర్వాత ప్రతినిధుల సభ ఆమోదం పొందాలి. అనంతరం అధ్యక్షుడి సంతకం జరిగితే ఇది చట్టంగా మారుతుంది. ప్రస్తుతం రష్యా నుంచి భారత్ గణనీయంగా ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. కొత్త బిల్లు ప్రకారం, రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు కొనసాగించే ప్రధాన దేశాలపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్‌లు విధించే అవకాశం ఉంటుంది. అయితే ఈ టారిఫ్‌లను ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్న తుది నిర్ణయం అమెరికా అధ్యక్షుడి పరిధిలో ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక వనరులు అందకుండా చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని అమెరికా చెబుతోంది. చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించి మాస్కోపై మరింత ఒత్తిడి తీసుకురావాలని అమెరికా చట్టసభ్యులు భావిస్తున్నారు. ఈ బిల్లులో రష్యాతో పాటు ఇరాన్‌పై కూడా అదనపు ఆంక్షలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.