BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:20 pm Posted by : BHARATH PRATHINIDHI

తాటిపూడి ఏపీఆర్జేసీ గురుకులంలో విద్యార్థులకు వైరల్ జ్వరాలు

పరిస్థితిపై ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పందన

పాఠశాల, ఏరియా ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులకు పరామర్శ

శృంగవరపుకోట, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ఎస్.కోట, మండల పరిధిలోని తాటిపూడి ఏపీఆర్జేసీ (APRJC) గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులు వైరల్ జ్వరాల భారిన పడినట్లు సమాచారం అందడంతో ఎస్.కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి తక్షణమే స్పందించారు. విషయం తెలిసిన వెంటనే ఎస్.కోట ఏరియా నిన్న రాత్రి ఆస్పత్రి డాక్టర్లతో ఫోన్ లో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ రోజు ఆమె గురుకుల పాఠశాలను ప్రత్యక్షంగా సందర్శించి, అక్కడ ఉన్న పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి జ్వరాలు వ్యాపించడానికి గల కారణాలను, పాఠశాలలో తీసుకుంటున్న పారిశుధ్య, వైద్య చర్యలను ఆరా తీశారు. అనంతరం అక్కడి నుంచే విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి, పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అంతేకాకుండా, విద్యార్థులతో కూడా వారి తల్లిదండ్రులకు ఫోన్లో మాట్లాడించి ధైర్యాన్ని నూరిపోశారు. పాఠశాల సందర్శన అనంతరం, ఎస్.కోట ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే లలితకుమారి పరామర్శించారు. ఆసుపత్రి వార్డుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యాన్ని సమీక్షించారు. బాధితులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని, ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరగా కోలుకునేలా చూడాలని అక్కడి వైద్యులను ఆదేశించారు. అలాగే గురుకుల పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్య లోపం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.