BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 3:16 pm Posted by : BHARATH PRATHINIDHI

గుంటూరులో బీసీ స్టాల్ గర్ల్స్ హాస్టల్ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించాలి

ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు నగర కమిటీ

గుంటూరులోని బీసీ హాస్టల్‌లో అస్వస్థతకు గురై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) గుంటూరు నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దుర్గాప్రసాద్ నాయక్, దాసరి కిరణ్ జీజీహెచ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు నిన్న ఐరన్ టాబ్లెట్లు ఇవ్వగా కొంతమందికి వికారం, వాంతులు రావడంతో వారిని జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అయితే అస్వస్థతకు గురైన విద్యార్థుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చిన విద్యార్థి సంఘాల ప్రతినిధులను అధికారులు అనుమతించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు.
విద్యార్థుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం విద్యార్థి సంఘాల బాధ్యత అని, అలాంటి సంఘాలనే విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. హాస్టళ్లలో ఉన్న సమస్యలు బయటపడతాయనే భయంతో విద్యార్థుల గొంతును నొక్కివేయడం అధికారులకు అలవాటుగా మారిందని విమర్శించారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాస్టళ్లకు లేదా ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను కలవడానికి వస్తే, ప్రభుత్వ అనుమతి లేకుండా రావద్దని ఒక జీవో ఉందని అధికారులు చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రశ్నిస్తున్నది ఆ జీవో విద్యార్థుల సంక్షేమం కోసమా? లేక హాస్టళ్లలో ఉన్న సమస్యలను కప్పిపుచ్చి విద్యార్థి సంఘాలు ప్రశ్నించకుండా అడ్డుకోవడానికా? అని నిలదీశారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే పూర్తి వివరాలను వెల్లడించాలని, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై వెంటనే స్పందించి, విద్యార్థుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలని, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లే ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలను అడ్డుకోవడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.