గుంటూరు, జూలై 31. భారత్ ప్రతినిధి న్యూస్ :
‘ఒక వైపు పొగాకు వ్యాపారం పేరుతో కిడ్నాప్ లకు పాల్పడుతున్న రౌడీలను వెనకేసుకొచ్చే జగన్, ఇప్పుడు పొగాకు రైతుల పరామర్శలకు వెళ్లడం దుర్మార్గం. గుంటూరులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడి అరాచకాలు కనిపించడం లేదా ? సీదిరి అప్పలరాజు కుమారుడి దౌర్జన్యాలు తెలియడం లేదా ? రాష్ట్రంలో గొడ్డలి పార్టీది అంతా నీచ సంస్కృతి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై అంబటి తీరును ఖండిస్తున్నాం. పెమ్మసానిని విమర్శించే స్థాయి అంబటికి ఉందా ? ఇలాంటి పార్టీని రాష్ట్రం నుంచి తరిమేయాలి’ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. శుక్రవారం స్థానిక 13వ వార్డు చౌత్రా సెంటర్ లో సంక్షేమ పాలన-ఇంటింటికీ ప్రచారంలో భాగంగా మన ఇంటికి-మన నసీర్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ ప్రతి ఇంటికీ వెళ్లి ఒక్కొక్కరి వద్ద సుమారు ఐదు నిమిషాలు కేటాయించారు. ప్రభుత్వం అందిస్తోన్న సేవలను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ, గుంటూరులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడిని, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి వంటి దొంగల ముఠాను వెనకేసుకొస్తోన్న జగన్ పరామర్శల పేరిట పనికిమాలిన యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బోగాపురం ఎయిర్ పోర్టుకు స్థల సేకరణ, అనుమతులన్నీ పూర్తి చేస్తే జగన్ వచ్చి శంకుస్థాపన చేశారని తెలిపారు. కేవలం ఐదేళ్లలో 26 శాతం మాత్రమే పనులు చేసి 86 శాతం పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఒకరు చేసిన పనులను తమ ఖాతాలో వేసుకోవాలనే ఆరాటం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబాయి హత్యను నరకాసుర వధ పేరిట ప్రచారం చేసిన జగన్ .. ఇప్పుడు తమ పార్టీ నేతలను కూడా అలాగే ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేవలం రెండేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాన స్థాయిలో ప్రజలకు అందించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించామని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులతో యువతకు మంచి భవిష్యత్తు అందించబోతున్నామని చెప్పారు. డీఎస్సీ అసత్య ఆరోపణలతో వైసీపీ యువతను పక్కదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.